Amaravathi capital concept plan ready

రాజధాని అమరావతి నగర నిర్మాణం కొరకు CRDA ఒక కాన్సెప్ట్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ప్రస్థుతం ఈ డ్రాఫ్ట్‌ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించాల్సి ఉంది. రాజధాని నగర ప్రాంతం, మౌలిక సదుపాయాలు, రాజధానిని పక్క రాష్ట్రాలతో అనుసంధానించే జాతీయ రహదారుల గురించి ఈ ప్రణాళికలో వివరించారు.   రాజధాని ప్రాంతాన్ని 8 ప్రణాళికా ప్రాంతాలుగా విభజించింది. ముఖ్యమంత్రి సింగపూర్‌ పర్యటన అనంతరం రాజధాని తుది మాస్టర్‌ ప్లాన్‌ను చంద్రబాబు ఆమోదించే అవకాశం ఉంది. కాన్సెప్ట్‌ ప్లాన్‌ వివరాల ప్రకారం   CRDA ప్రాంతం 7317 చ.కి.మీ., జనాభా 55 లక్షలు, 57 మండలాలు, 816 రెవెన్యూ గ్రామాలు, 11 పట్టణాభివృద్ధి సంస్థలు ఉంటాయి. రాజధాని నగర ప్రణాళికా ప్రాంతం 217 చ.కి.మీ., ఇందులో రెవెన్యూ గ్రామాలు 25. సీడ్‌ కాపిటల్‌ 16.94 చ.కి.మీ. ఇందులో జనాభా 32 లక్షలు, రెవెన్యూ గ్రామాలు 163. పట్టాణాభివృద్ధి సంస్థలు 5. రాజధాని నగర ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఔటర్‌ రింగు రోడ్డులపై దృష్టి సారించింది. 2017 లోపు ఫేజ్‌-1 లో 51.6 కి.మీ. పొడవున రహదారులు పూర్తి చేయాల్సి ఉంది. ఫేజ్‌-2 లో 66.7 కి.మీ. పొడవున, ఫేజ్‌-3 లో 41.6 కి.మీ. పొడవున రహదారులను 2017-2020 లోగా పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు అనేక పర్యాటక ప్రాజెక్ట్ లను కూడా చేపడుతున్నారు. అగిరిపల్లి వద్ద ఫిలిం సిటీని నిర్మిస్తారు. గుడివాడ వద్ద జైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. CRDA రాజధాని నగర ప్రాంతంలో అభివృద్ధి కారిడార్ల ప్రణాళికలను రూపొందించింది. మచిలీపట్నం పోర్టు నుండి నిజాం పట్నం వరకు రాజధాని నగర సమీపంలో ఒక రహదారి ఉంటుంది. రాజధాని నుంచి విశాఖపట్నం వరకు మరో రహదారి ఉంటుంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు గోదావరి, కృష్ణా కాల్వలను జలరవాణాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తారు.

\r\n

Posted Date: 19-09-2015