Navyandhrapradesh capital Amaravathi foundation stone ceremony to be done gloriously

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. విజయదశమి రోజునే ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి దేశవిదేశాల నుండి ప్రవాసాంధ్రులను ఆహ్వానిస్తున్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అతిరధమహారధుల సమక్షంలో ఘనంగా ఈ కార్యక్రమం జరుగబోతుంది. భారత్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. తుళ్ళూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామం సమీపంలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని సమాచారం. 30-40 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. దీన్ని భవిష్యత్తులో ఒక సందర్శనీయ స్థలంగా తీర్చిదిద్దాలని, అక్కడ ఒక భారీ చిహ్నాన్ని నిర్మించి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులందరి పేర్లను దానిపై లిఖించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభం నుండి చెబుతూనే ఉన్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం చంఘిజ్‌ఖాన్‌ పేటలో ఇస్కాన్‌ స్వర్ణదేవాలయ నిర్మాణానికి కూడా అదే రోజున శంకుస్థాపన జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 80 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. ఇందులో 16 ఎకరాల్లో హంస ఆకారంలో ఉన్న స్వర్ణ దేయాలయాన్ని నిర్మిస్తారు. 20 ఎకరాల్లో గోవు విశ్వవిద్యాలయం, 40 ఎకరాల్లో వైద్యశాల, విద్యాలయాల నిర్మాణాలు జరుగుతాయి. ఈ ప్రాజెక్ట్‌ 200 కోట్ల వ్యయంతో నిర్మించబడుతున్నట్లు సమాచారం. శంకుస్థాపనకు వాస్తుపరంగా అన్నివిధాలా అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు సమాచారం. రాజధాని నగరాన్ని ఆంధ్రులందరూ గర్వించదగ్గ విధంగా ఒక డైనమిక్‌ సిటీగా తయారుచేస్తామని చంద్రబాబు తెలిపారు.

\r\n

Posted Date: 29-09-2015