https://terrafortune.com:443/news-detail/New-Terminal-construction-for-vijayawada-airport-with-137-crores/75 New Terminal construction for vijayawada airport with 137 crores - Terrafortune.com New Terminal construction for vijayawada airport with 137 crores - Terrafortune.com

New Terminal construction for vijayawada airport with 137 crores

నవ్యాంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని ప్రాంతంలో విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయంలో త్వరలో నూతన టర్మినల్‌ ఏర్పాటు కాబోతుంది.9520 చ.కి.మీ.విస్తీర్ణంలో, 137 కోట్లతో ఈ టర్మినల్‌ భవనం నిర్మించబడుతుంది. ఈ భవన నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 19 వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. కోల్‌కత్తాకు చెందిన ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ఈ టర్మినల్‌ నిర్మాణ పనులు అప్పగిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ ఢిల్లీలో ఈ కొత్త టర్మినల్‌ నమూనాను విడుదల చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు ఈ టర్మినల్‌ ప్రత్యేకతలను వివరించారు. ఈ టర్మినల్‌ లో  VIP లాంజ్‌,  అధికారుల కొరకు కాన్ఫరెన్స్‌ హాల్స్‌, కార్యాలయ వసతులు కల్పిస్తారు. ప్రయాణికులు లోపలికి ప్రవేశించుటకు 16 చెక్‌-ఇన్‌ కౌంటర్లు ఉంటాయి. లగేజీను తరలించడానికి కన్వేయర్‌ బెల్ట్‌ సిస్టమ్స్‌ ఉంటాయి. సెంట్రల్‌ ఎసి,CCTV   లు ఉంటాయి. విమానాల రాకపోకలను తెలుసుకోవడానికి డిస్‌ప్లే  సిస్టమ్స్‌ ఉంటాయి. 2016 డిశెంబర్‌ కు ఈ టర్మినల్‌ నిర్మాణం పూర్తి అవుతుందని అంచనా. ప్రస్థుతం విజయవాడ నుంచి ఢిల్లీ‌, చెన్నై, బెంగుళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉన్నాయి. వచ్చే నెల నుంచి కొచ్చి, షిర్డీకి కూడా సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. రద్దు చేయబడిన విజయవాడ-వైజాగ్‌ ఎయిర్‌ కోస్టా విమానం కూడా త్వరలో మళ్ళీ ప్రారంభమవుతుంది. సుమారు 800-1000 కోట్ల ఖర్చుతో విజయవాడ విమానాశ్రయాన్ని విస్తరించుటకు ప్రణాళికలున్నాయి. దీనిలో భాగంగా ప్రస్థుతం ఉన్న రన్‌ వే ను 2286 మీటర్ల నుండి 4430 మీటర్లకు పొడిగిస్తారు. మాస్టర్‌ టర్మినల్‌, టాక్సీ ట్రాకును నిర్మిస్తారు. ప్రస్థుతం ఉన్న 6 బేలకు అదనంగా 18 కోట్లతో మరో 10 బేలను నిర్మిస్తారు. విజయవాడ  విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుటకు 698 ఎకరాల స్థలం అవసరమని గుర్తించారు. భూసమీకరణ పద్ధతిలో భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రన్‌ వే ను 14,500 అడుగులకు పెంచగలిగితే  A-380 వంటి పెద్ద విమానాలు దిగేందుకు ప్రపంచ శ్రేణి విమానాశ్రయంగా గుర్తింపు పొందుటకు అవకాశం ఉంటుంది. కొత్త టర్మినల్‌ నిర్మాణం పూర్తయ్యేంత వరకు పాత విమానాశ్రయాన్ని ఉపయోగించుకోవాల్సి ఉండటంతో 6 కోట్లతో పాత విమానాశ్రయానికి అదనపు హంగులు కల్పించుటకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రద్దీ సమయంలో  ఒకేసారి 500 మంది ప్రయాణికులకు వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.AP విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.

\r\n

Posted Date: 15-10-2015