https://terrafortune.com:443/news-detail/No-land-acquisition,-Only-land-pooling-for-AP-new-capital-Amaravathi/54 No land acquisition, Only land pooling for AP new capital Amaravathi - Terrafortune.com No land acquisition, Only land pooling for AP new capital Amaravathi - Terrafortune.com

No land acquisition, Only land pooling for AP new capital Amaravathi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు భూసమీకరణ ద్వారా ఎంతో నైపుణ్యంతో ఎటువంటి ఖర్చు లేకుండా రైతుల ఒప్పందంతో 33,000 ఎకరాల భూములను సేకరించింది. ఇంకా 3800 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. దీనిని భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. భూసేకరణ కొరకు తుళ్ళూరు మండలంలోని 5 గ్రామాలకు సంబంధించిన 11 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనితో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఒక వైపు రైతుల నిరసనలు, ప్రతిపక్షాల ఒత్తిళ్ళతో భూసేకరణపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుంది. కేవలం భూసమీకరణ ద్వారానే భూములు సేకరించాలని భావిస్తుంది. భూసేకరణ ఆర్డినెన్స్‌ గడువు పొడిగించే అవకాశం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా ప్రకటించారు. ఆర్డినెన్స్‌ గడువు కూడా ముగిసింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఇకపై భూసేకరణ వైపు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుండి భూసేకరణకు వ్యతిరేకంగానే ఉన్నారని, రాజధాని అభివృద్ధికి అన్ని ప్రణాళికలు సిద్ధం అయిన తరువాత జాప్యం జరగకూడదనే కారణంతోనే భూసేకరణ నోటిఫికేషన్‌ ఇవ్వవలసి వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టి భూములను తీసుకోవడం తమ ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని వివరించారు. భూయజమానులను ఒప్పించి భూసమీకరణ ద్వారానే మిగిలిన భూములను సేకరిస్తామని తెలిపారు. రైతులు స్వచ్చందంగా ముందుకు రావాలని రాజధాని నిర్మాణానికి భూములిచ్చి సహకరించాలని రైతులను కోరారు. ఇప్పటికే 600 ఎకరాల భూములను ఇవ్వడానికి రైతులు సమ్మతి ఇవ్వడం జరిగిందని అతి త్వరలో భూసమీకరణ పూర్తవుతుందని నారాయణ తెలిపారు. 

\r\n

Posted Date: 01-09-2015