https://terrafortune.com:443/news-detail/well-designed-infrastructure-for-AP-capital-Amaravathi/41 well designed infrastructure for AP capital Amaravathi - Terrafortune.com well designed infrastructure for AP capital Amaravathi - Terrafortune.com

well designed infrastructure for AP capital Amaravathi

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సీడ్‌ కాపిటల్‌ అవసరాలకు అనుగుణంగా సింగపూర్‌ ప్రభుత్వం అందించిన ప్రణాళికలో మౌలిక సదుపాయాల కొరకు సమర్ధవంతమైన ప్రతిపాదనలను సిద్దం చేసింది. రహదారులు, వరద నీటి నిర్వహణ, తాగునీటి సరఫరా, మురుగు నీటి పారుదల, విద్యుత్తు సరఫరా, వ్యర్ధ నిర్వహణ, టెలికం నెట్‌ వర్క్‌కు వేరు వేరుగా ప్రణాళికలు రూపొందించింది. మౌలిక సదుపాయాల కల్పనపై దశల వారీ నిర్మాణం కొరకు సూచనలు కూడా ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను ప్రారంభించడానికి ప్రత్యేక రోడ్డు అవసరం. దీని కొరకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధాని కేంద్ర ప్రాంతంలో నిర్మాణాలకు చేరుకునే విధంగా ప్రత్యేక మార్గం నిర్మిస్తారు. డౌన్‌టౌన్‌ రోడ్‌ ప్రధాన వ్యాపార, పరిపాలన కేంద్రానికి ముఖ్యమైన రహదారిగా ఉంటుంది. ఇది విజయవాడ-అమరావతి-రాయపూడి రోడ్డుకు 1 కి.మీ. దూరంలో 7 కి.మీ. పొడవున ఉంటుంది. డౌన్‌ టౌన్‌ మార్గంలో తాగునీటి సరఫరా, మురుగు నీటి పారుదల, విద్యుత్‌ సరఫరా, టెలికం సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. రాజధాని కేంద్ర ప్రాంతంలో 3 తాగునీటి సరఫరా కేంద్రాలుంటాయి. భూగర్భ, ఉపరితల ట్యాంకులు ఉంటాయి. తొలిదశ సీడ్‌ కాపిటల్‌ నిర్మాణం పూర్తయే లోపు కృష్ణానది నుండి నీటిని తీసుకునేలా 260 ఎంఎల్‌డి సామర్ధ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. రాజధాని కేంద్రప్రాంతం కొండవీటి వాగు పరీవాహక ప్రాంతంలో ఉండటం వలన వాగు ప్రవాహాలు పెరిగినపుడు ఈ ప్రాంతం జలమయమయ్యే ప్రమాదం ఉంది. దీనికి ప్రస్థుతం ఉన్న నది గట్టు రక్షణగా ఉంటుంది. భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా గట్టులను బలోపేతం చేయనున్నారు. వరద నీటిని మళ్ళించేందుకు కాలువలను నిర్మించాలని ప్రణాళికలో సూచించారు. టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకుని రాజధాని కేంద్ర ప్రాంతంలో టెలికం నెట్‌ వర్క్‌ను ఏర్పాటు చేయాలి. దీనికొరకు రోడ్‌ నెట్‌ వర్క్‌ పరిధిలోనే కొంత స్థలాన్ని కేబుల్‌ లైన్ల కోసం కేటాయిస్తారు. ఈ విధంగా రాజధాని మౌలిక సదుపాయాల కొరకు సమర్ధవంతమైన ప్రణాళికలను రూపొందించారు.

\r\n

Posted Date: 08-08-2015